Chandrababu: ఐఐటీ మద్రాస్ దేశంలోనే నెంబర్ వన్ 4 d ago

ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోందన్నారు సీఎం చంద్రబాబు. చెన్నైలోని ఏఐఆర్ఎస్ఎస్ సమ్మిట్‌కి హాజరైన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐఐటీ మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని, ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతం అవుతున్నాయని తెలిపారు. ఐఐటీల స్థాపన విద్యా రంగంలోనే గొప్ప విషయమని, ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ కోర్సులు కూడా అందిస్తోందని, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదేనని పేర్కొన్నారు. ఇక్కడ దాదాపు 35 నుంచి 40 శాతం వరకు తెలుగు విద్యార్థులే ఉన్నారన్నారు.
రాజకీయ సంస్కరణల వలన సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయిందని, అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేశాయని, ఆర్థిక సంస్కరణల తరువాత భారత్ ఆభివృద్ధి బాట పట్టిందన్నారు. ఆర్థిక సంస్కరణల తరువాత ప్రపంచంలోనే చైనా రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. బ్రిటిష్ వారు దేశం నుంచి అంతా తీసుకెళ్లారని, ఒక్క ఇంగ్లీష్‌ను మాత్రం మనకు వదిలి వెళ్లారని చెప్పారు. 1990లో కమ్యూనికేషన్ రంగం బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యంగా ఉండేదని, ఆర్థిక సంస్కరణల తరువాత కమ్యూనికేషన్ రంగంలో ప్రైవేటు సంస్థలు వచ్చాయని తెలిపారు. కొంత కాలంగా భారత వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోందన్నారు.